Philemon

అపొస్తలిక అభివందనాలు

1మా ప్రియ జతపనివాడు అయిన ఫిలేమోనుకు, 2మన సోదరి అప్ఫియకు, మనతో కలిసి పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. 3మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

ఫిలేమోను వ్యక్తిత్వం

4
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Phm 1:5.
In this translation, this verse contains text which in some other translations appears in verses Phm 1:4-Phm 1:5.
5ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. 6క్రీస్తులో నీకు కలిగిన ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వలన ఇతరులు నీ విశ్వాసంలో భాగస్తులు అవుతూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను. 7సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద తీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.

ఒనేసిము కోసం వేడికోలు

8అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ, 9ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.

10నేను ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు. 11గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు. 12నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. 13నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీకు బదులుగా నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను

14అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనం బలవంతంతో కాక ఇష్టపూర్వకంగా ఉండాలని నా అభిప్రాయం. 15బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు. 16ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు.

17అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో. 18ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి. 19పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు. 20ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.

21నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.

వందనాలు, ముగింపు

22సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.

23క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా, 24అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.

25మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. ఆమెన్.

Copyright information for TelULB